అప్పని వరప్రసాదమీ అన్నమయ్య

dsc004772శ్రీ  తాళ్ళపాక అన్నమాచార్యుల జీవితచరిత్రం

రచయిత: తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు.
(చిన్నన్న)
ప్రతులకు: తిరుమల తిరుపతి దేవస్థానం
వెల: “వెల సులభం ఫలమధికం”

సుమారు 600 ఏండ్ల క్రితం ఈ భూమ్మీదకు దిగిన హరినందకాంశజుడు, శ్రీ  తాళ్ళపాక అన్నమయ్య. వేలకువేల సంకీర్తనలతో, తెలుగు భాషను పునీతంచేసిన వాడు, అన్నమయ్య. ఇంచుమించుగా, 550 ఏండ్ల క్రితం రాసినా, ఈ రోజుకు కూడ జనాల నోళ్ళలో నానుతున్న, ఈ పాటలు,   తెలుగు పలుకుబడులతో, పదాల కూర్పులతో,  మరెవ్వరికీ సాద్యం  కాని రీతిలో తెలుగు భాషలో  రచించబడిన సంకీర్తనలు.భక్తిని, రక్తిని, వేదాల్ని, వేదాంతాన్ని, సమాజరీతుల్ని, తన సంకీర్తనల ద్వారా అందరికీ చాటి చెప్పిన అన్నమయ్య గాధ, జీవిత చరిత్రగా మారి మన ముందుకొచ్చింది, సుమారు 60 ఏండ్ల క్రితమే.

అప్పటికింకా సంగీతం ఇంతగా అభివ్రుద్ది చెందలేదు.( ఆయన సంకీర్తనలకు రాగ నిర్దేశం జరిగినా, కొన్నింటికి తాళ నిర్దేశం జరుగలేదు. ) తెలుగు భాషలో అందునా జానపదాలతో పాటలు రాయటం ఊహకు కూడా అందని  ( సంస్క్రుతంలో రాసినవాడే కవి అని నమ్మిన ) కాలమది. అటువంటి కాలంలో, సంకీర్తనలకంటూ ఓ విధానం రూపొందించి ( సంకీర్తనా లక్షణమ్మనే గ్రంథం రచించినట్టు తెలుస్తూంది.), వాటిని జానపదుల పదాలతొ వ్యవహారభాషలో, శ్రీ వేంకటేశుని పరంగా ఆయన పాడిన పదాలు, నేటికీ నిత్యనూతనాలు, ఆ పాతమధురాలు, వన్నె తరగని తెలుగు దనపు గుభాళింపులు.
దాదాపు 150 సంవత్సరాల పాటు తెలుగు నేల పై విలసిల్లిన ఆ పదాలు ఆ తరువాత ఎందువల్లనో కనుమరుగై పోయాయి. “దాచుకో” అని అప్పనికి అప్పగించిన పదాలను,  ఆయన దాచేసుకున్నట్లున్నాడు,  మనకు అందుబాటులో లేకపోయాయి. 1816లో అచ్చువేయించిన  A. D. Campbell  రచించిన “Grammar of Telugu Language” పుస్తక పీఠికలో,  ” పవిత్రమైన తిరుపతి కొండ మీద, ఒక  వ్యాకరణ ప్రతి, మిగిలనవన్నీ, ఆ దైవాన్ని స్తుతిస్తూ రాసిన అసంఖ్యాక మైన కీర్తనలు” అని అన్నమయ్య కీర్తనల ప్రస్తావన జరిగినది. ఐతే ” the whole collection was found to contain nothing but voluminous hymns of the deity” అనేది, భాషాపరిమళం తెలియని దొర గారి అభిప్రాయమైనా, దాని ఆధారం గానే అన్నమయ్య క్రుతులు వెలుగు లోనికి వచ్చాయి.1922 లో, భాష్యకారుల సన్నిధానం వద్ద, ఇప్పుడు అన్నమయ్య అర అనబడుతున్న చోట, ఇరువైపులా,  అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్య, అరను చూపిస్తూ, నిలుచున్న తీరును గమనించిన దేవాలయ అధికారులు, అరను తెరిపించి చూడగా, సంకీర్తనల రాగి రేకులు వెలుగు చూసాయి( హుండీ కెదురుగా నేటికీ ఈ అరను చూడవచ్చు. )

ఐతే అన్నమయ్య జీవితచరిత్ర కు సంబంధించిన ఆధారం చిన్నన్న రాసిన “అన్నమయ్య జీవితచరిత్రము” అనే ద్విపద కావ్యం. ఎవరెన్ని వూహించి రాసినా, ఆయన జీవితాన్ని ఎన్ని విధాలుగ అర్థం చేసుకోవాలన్నా, అది చిన్నన్న కావ్యం తోనే జరిగింది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచన గా ప్రచురితమైన ఈ “అన్నమయ్య జీవిత చరిత్రము” ద్విపద కావ్యమును పరిష్కరించి రాసి, ప్రచురించిన( తి. తి. దేవస్తానం చే) వచనం. దరిమిలా మరి రెండు పునః ముద్రణలు పొందిన ” జీవిత చరిత్ర” ఇప్పటి వరకూ దొరకిన ఆధారాల మాలిక. వివిధ ఘట్టాలుగాచిన్నన్న రాసిన ద్విపదలో
* అన్నమాచార్య వన్శ్యులు, తాతలు, తండ్రి నారాయణ సూరి
* అన్నమయ్య జననం, బాల్యం , విధ్యలు
* తిరుమల ప్రయాణం
* దేవి ప్రత్యక్షము, శతకం చెప్పుట
* కొండ పై దివ్యస్థలముల దర్శనం
* స్వామి దర్శనం, శతకం చెప్పుట
* అర్చకులు అన్నమయ్య మహిమ గుర్తించుట
* అన్నమయ్యకు పంచసంస్కారములు (వైష్ణవ ఆచారము)
* అన్నమయ్య పెండ్లి
* సాళువ నర్సింగరాయని దర్శనం, సంకెల బెట్టుట, పిదప పశ్చాత్తాపం
* అన్నమయ్య మహిమలు
* పురందరదాసుని తో చెలిమి
* అన్నమయ్య ఇతర రచనలు
* వారి సంతతి గురించి వర్ణన ఉంది.
ఐతే అన్నమయ్య పంచసంస్కారములుకూ  అన్నమయ్య పెండ్లికీ మధ్య కొంత కాలానికి సంబంధించిన వివరాలు గ్రంథ పాతము వలన లభ్యం కావటం లేదు.

ఈయన సంకీర్తనల విధానాన్ని ఒక్కసారి పరికిస్తే మొదట పల్లవి, ఆ తరువాత చరణాలతొ( సాధారణంగా 2 లేక 3 ) వుంటాయి. కొన్నిటిలో అనుపల్లవి కూడా  వుండటం కద్దు. పల్లవి చరణాల సారాంశంగా ఉండి, చరణాలకు దిక్చూచిగా ఉంటుంది. చరణాలు పల్లవిని విశధీకరిస్తూ సాగుతాయి. కొన్ని గీతాలలో ప్రతీ పాదం ఈ పనిని నెరవేర్చటం జరుగుతుంది. మచ్చుకు ” కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” సంకీర్తనాన్ని తీసుకుందాము.
పల్లవిలో వెంకటేశ్వరుడు కొండలంత వరాలను గుప్పించేవాడని చెప్పి, మొదటి చరణంలో, కురువరత్తినంబికు ఇచ్చిన వరాలని, తొండమాన్ చక్రవర్తికి తోడ్పడిన విధానాన్ని వివరిస్తే, రెండవ పాదం లో, అనంతాళువారికి చేసిన సేవల్నీ గురించి, తిరుమలనంబి తొ ముచ్చట్ల గురించి చెబుతాడు. చివర పాదంలో తిరుక్కచ్చినంబిని కరుణించిన విధానాన్ని చెప్పి, “ఎంచ నెక్కుడైన వేంకటేశుడు మనలకు” అంటూ వేంకటేశ్వర ముద్రతో ముగిస్తాడు.

మొత్తం సంకీర్తనలు ” పరమ తంత్రములు ముప్పది రెండువేలు” గా చిన్నన్న తెలిపాడు. అలాగే, ” పాడేము మేము పరమాత్మ నిన్నును, వేడుక ముప్పదిరెండు వేలల రాగాలను” అని అన్నమ్మయ్య సూచించాడు. ఐతే ఇప్పటి వరకూ దొరికినవి, ఇంచుమించుగా, పదహారు వేల కీర్తనలు. ఇవి, రాగి రేకులు గా, వ్రాతప్రతులు గా, వేర్వేరు ప్రాంతాల నుండి సంగ్రహించినవి. అన్నమ్మయ్య జీవితకాలంలో దర్శించిన ప్రదేశాలలో మరి కొన్ని దాగి వుండ వచ్చు. అలాగే రాగి లోహం కోసం కొందరు రేకులను కరిగించివేసారనే అపప్రధ కూడా మనం వింటున్నాం. దొరకిన వాటిల్లో, 3 నుండి 4 వేల సంకీర్తనలను రాళ్ళపల్లి అనంత క్రిష్ణ శర్మ, నేదునూరి క్రిష్ణ మూర్తి మొదలుకొని, ఈనాటి తరంవారైన శొభారాజు, గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాదు వరకూ స్వరకల్పన చేసారు. వీరె కాక  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ,రజనీకాంత రావు, మల్లిక్ వంటి వారు కూడా విశేష క్రుషి సలిపి కొన్ని గీతాలకు మంచి మంచి బాణీలను అందించారు. అలాగే వర్థమాన సంగీత కళాకారులు కూడా తమ వంతు క్రుషి చేస్తున్నారు. ఐతే, అన్నమాచార్యుని సంకీర్తనలలో, ఒకే సంకీర్తన  మనం వివిధ బాణీలలో వినటం జరుగుతుంది. కారణం,ఇప్పుడు వింటున్న బాణీలేవీ ఆయన స్వయంగా కూర్పు చేసినవి కావు. సంకీర్తనలు శిష్య పరంపరగా మనకు అందలేదు. అందువల్ల చాలవరకు బాణీలను ఇప్పటి తరం గాయకులు, అన్నమయ్య సూచించిన రాగాల ఆధారంగా,  స్వర రచన చేసారు. కొన్నింటినైతే, ఆయన సూచించిన రాగాలలో కాక వేరే రాగాలలో,  స్వర రచన చేసారు. ఐతే మిగిలిన 12 వేల సంకీర్తనల మాటేమిటి? క్రితం ఏడాది, 600వ జయంతి సందర్బంగా, త్వరలోనె మిగిలిన సంకీర్తనలను స్వరబద్దం చేస్తామని ప్రకటించారు. పూర్తి ఐనట్టు లేదు. ఒక వేళ అన్నింటి స్వరరచన పూర్తి ఐనా, వాటిని సామాన్య ప్రజానీకానికి తీసుకుని వెళ్ళటం ముఖ్యం. ( అన్నమయ్య ప్రాజక్టు ద్వార స్వరపరచిన కీర్తనలు  C. D, cassette  రూపంలో తి. తి. దేవస్థానం వారు తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఈ సారి తిరుమల దర్శించినప్పుదు వాటిని కొని, విని ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!)

అన్నమాచార్యులు, సంకీర్తనలనే కాక, ఇతర రచనలు ,
” ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున
నవముగా రామాయణము, దివ్య భాష
నా వేంకటాద్రి మహాత్యమంతయును
గావించి, రుచుల శ్రుంగార మంజరియు
శతకముల్ పది రెండు సకల భాషలను
ప్రతిలేని నానా ప్రభంధముల్ చేసి” నట్లు గా చిన్నన్న చెప్పాడు.
ఇందులో కొన్ని తెలుగులోను, సంస్క్రుతములోను, ఇతరభాష లలోను చేసినట్టు తెలుస్తూంది. పైన చెప్పిన రచనలలో చాలా వరకూ ఇప్పుడు లభ్యం కావటం లేదు.

ద్రవిడ భాషలయిన తెలుగు, కన్నడ భాషలలో లభించిన ఆధారాలనుబట్టి చూస్తే,  అన్నమయ్య సంకీర్తనలే ప్రాచీనమైనవి. కర్ణాటక సంగీతానికి ఆద్యునిగా పరిగణించబడుతున్న, పురంధరదాసు, అన్నమయ్య తరువాతి తరం వాడేనని చెప్పవచ్చు. క్షేత్రయ్య, రామదాసు, సంగీతత్రయం( త్యాగయ్య, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి) మున్నగువారంతా , ఈయన తరువాత తరముల వారే! అందుకే ఈయన ” పద కవితా పితామహు”ని గా ప్రసిద్ధి కెక్కాడు.

కవితా రీతులకు వస్తే, చిన్నన్న చెప్పినట్లు
” యోగ మార్గంబున నొక కొన్ని బుధులు
రాగిల్ల శ్రుంగార రస రీతి గొన్ని
వైరాగ్య రచనతో వాసింప గొన్ని
సారస నేత్రుపై సంకీర్తనలు ” అన్ని రీతులలొ ఈయన సంకీర్తనలు సాగాయి.
“ఏల నీ దయ రాదూ”  ( త్యాగయ్య ) లాంటి భావనలు మచ్చు కైనా కానరావు. ఆంతటా, హరి సంకీర్తనమే! శ్రుంగారం కానీయండి, వైరాగ్యం కానీయండి, హరి సంకీర్తనమే పరమావధిగా సాగిన సంకీర్తనలలో అక్కడక్కడా, అప్పటి సమాజాన్ని, దాని పొకడలనూ పట్టిచ్చాడు.

“చాటెదనిదియే సత్యం సుండో
చేటు లేదీతని సేవించినను” అని శ్రీ హరి విశేషాలను ఎలుగెత్తి చాటాడు.
“రహస్యమిదివో రహి శ్రీ వెంకట
మహీధరమున మనకై నిలిచె” అని రహస్యాలను విప్పి చెప్పాడు.
“రూకలై, మాడలై, రువ్వలై తిరిగీనీ
దాకొని వున్నచోట దా నుండ దిదివో” అంటూ లక్ష్మీ విలాసాన్ని తెలిపాడు.
” నాటికి నాడే నా చదువు
మాటలాడుచును మరచేటి చదు”వంటూ వంట బట్టని నేటి విద్యలను హేళన చేసాడు.
కాపీరాయుళ్ళను ఈసడిస్తూ,
“వెర్రులాల మీకు వేడుక గలిగితేను

అఱ్రువంచి తడుకల్లంగ రాదా” అన్నాడు.

“పుట్టు భోగులము మేము భువి హరిదాసులము
నట్ట నడిమి దొరలు నాకియ్యవలెనా” అంటూ రాజాశ్రయాల్ని ఈసడించాడు.
“వెఱతు వెఱతు నిండు వేడుక పడనిట్టి
కుఱుచ బుద్ధుల నిట్టు గూడుదునయ్య” అంటూ విలువలు పాటించని దొరలను తెగనాడాడు.
” మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొక్కటే
చండాలుడుండేటి సరి భూమి యొకటే” ననే సామ్యవాదాన్ని ఆనాడే చాటాడు.
” పుట్టుట నిజము, పోవుట నిజము
నట్టనడిమి పని నాటకమ”ని వేదాంతాన్ని
“పరగిన సత్య సంపన్నుడైన వాడే
పరనింద సేయ తత్పరు కాని వాడు
అరుదైన భూతదయా నిధి యగు వాడె
పరులు తానే యని భావించు వాడే” మనిషని స్పష్టీకరించాడు.
“తనలోని జ్ఞానమును తప్పకుండా తలపోసి
పని తోడ నందు వల్ల భక్తి నిలిపి” అంటూ మన జీవితలెనెట్లా మలచుకోవాలొ “మూడే మాటలంటూ” వేదాంత రహస్యం గా వెల్లడించాడు.
” చీ, చీ, నరులదేటి జీవనం
కాచుక శ్రీ హరి నీవే కరుణింతు గాక” యని మానవుల జీవిత విధానాలను తూర్పూరబట్టాడు.
“కడు నజ్ఞానపు కరవు కాలమిదే
వెడల దొబ్బి మావెరవు దీర్చవే” ఆనాటి కరువు కాలాన్ని మన ముందుంచాడు.
ఇక, అన్నమయ్య పదాల తీరు తెన్నులకొస్తే
” వెనెలపై తేట  తిన్నని చెఱకు
పానకముల నేరుపరచిన మేలు
చక్కర లో తీపు  చల్ల తెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నముల
కలయమ్రుతంబు మీగడ మీది చవులు” అని చిన్నన్న అనటంలో అతిశయోక్తి లేనే లేదు.

జాజర పాటలు,  చందమామ పాటలు, లాలి పాటలు, జోల పాటలు, తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, దంపుడు పాటలు, పెండ్లి పాటలు, హారతి పాటలు, తందనాన పాటలు, మొదలైనవి జనబాహుళ్యనికి దగ్గరైన పదాలతో, వారి పాటలు గానే రాసి, వారి శ్రమ  లో సంతోషములో
శ్రీ వారిని కొలిచేటట్లు చేసి, ఆయనతో వారు మమేక మయ్యేటట్లు చేయగలిగిన హరి భక్తుడాయన.
” అరె చూడరె మోహన రూప”మంటూ శ్రీ హరిని
“నిందరికి అభయ్యమ్మిచ్చు ” అభయ హస్తాన్ని
“బ్రహ్మ కడిగిన” శ్రీ హరి పాదాన్ని
“చక్రమా” అంటూ ఆయుధాన్ని
“ఆదివో” అంటూ శ్రీ హరి నివాసాన్ని
“దేవునికి దేవికిని తెప్పల” కోనేటినీ
“తిరువీధుల మెరసీ” అంటూ బ్రహ్మోత్సవాల నీ
” పలుకు తేనెల తల్లి” యని అలమేలు మంగ నూ
“కొలువై వున్నాడు వీడే” యని గోవింద రాజుల్నీ
” రంగ రంగ” యని శ్రీ రంగ నాధుణ్నీ
“రాముడు రాఘవుడు” అని రవి కుల తిలకుడినీ
“ముద్దు గారే” యశొదా తనయుణ్ని,
“పెరిగినాడు చూడరో’ యని హనుమంతుడిని
“నమో నమో” యని నారసిమ్హుడినీ, ఇలా పలు కీర్తనలతో తానెరిగిన ప్రదేశాలలొని పలు దేవతలను  ప్రస్తుతించాడు.
అలాగే ఒకే విషయంపై పెక్కు గీతాలున్నాయి. ప్రతి దినమొక సంకీర్తన లక్ష్యం గా చేసికొన్న అన్నమయ్య కు తమిళ హరి భక్తులు ఆళ్వారులే స్పూర్తి. ఐతే, అక్కడక్కడా పునరుక్తి భావాలను మనం పసిగట్టవచ్చు.  రాశి ని పరిగణలోనికి తీసుకున్నా, వాటి పదాల కూర్పును తీసుకున్నా, ఏ సంకీర్తన కది విశిష్తమైనదే!

తెలుగు సంస్క్రుత భాషలలో అసమాన ప్రతిభ కలిగి ఉన్నా, ఎక్కువగా అచ్చ తెలుగు భాషలో సంకీర్తనలను రాయటం, ఈ భాషాపరులు చేసుకొన్న పుణ్యమనే చెప్పాలి.
“ఎట్టైనా జేసుకో, ఇక నీ చిత్తము నన్ను
పట్టిచ్చె మా గురుడు నీ పాదాలు విడువ” నన్న భక్తి పరుడు అన్నమయ్య.
ఉప సమ్హారం:
చిన్నన్న ద్విపద ఆధారంగా, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించి రాసిన “అన్నమయ్య జీవిత చరిత్రము” మూడవముద్రణ ఈ రచన కాధారము. వారున్నూ, వారి శిష్యులు
అర్చకం శ్రీనివాసులు చేసిన క్రుషి మరువరానిది. ఈ రంగం లో  ఉద్ధండుల చే చాల  రచనలు చేయబడ్డాయి. వాటిలో చాల వరకు, తి. తి. దే. ప్రచురణల గా మనకు దొరుకుతాయి. ఆసక్తి ఉంటే మరిన్ని విషయాలు తెలుస్తాయి.
అన్నమయ్య 601 వ జయంతి సందర్బంగా ఈ రచన వెలువరించాను. మీలొ చాలా మందికీ విషయాలు తెలిసే ఉండవచ్చు. నాకు తెలిసిన కొన్ని విశేషాలతో ఈ రచన చేసాను.
అన్నీ ఒకే వ్యాసం లో రాయటం దాదాపు అసాధ్యం. మీలో ఎవరైనా మరిన్ని విశేషాలు తెలిపితే నాకూ సంతోషమే!
ఉంటాను.
…మరమరాలు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: