మంచి మిత్రుల కథ (The Google Story)

సెప్టెంబర్ 16, 2009

googlebookరచయిత: డేవిడ్ అ వేస్ (David A Vise)మరియు మార్క్ మల్సీడ్ ( Mark Malseed)

ప్రచురణ: డిలకాత్ ప్రెస్సు (Delacorte Press)

వెల: 26 డాలర్లు

గూగులు వెదుకులాట (Google Search Engine) గురించి తెలియని కంప్యుటరు
వాడకందార్లు వుండకపోవచ్చు.అంతగా ఉపయోగపడే ఈ సాఫ్టవేరు పరికరం ఉచితం
గా ఎవరైనా వాడుకోవచ్చు. ఐతే, దాని స్రుస్టికర్తలకు దక్కేదేమిటి? పేరు మాత్రమేనా!
మరేమైన వుందా! వారి ఆలోచనా విధాన మేది? వారనుకున్నదానిలో గత
దశాబ్దములో ఏమైనా సాధించారా? ఇంకా ఏమైన మిగిలాయా? వీటికి సమాధానాలు కావలసివస్తే ఈ ” మంచి మిత్రుల కథ” చదవాల్సిందే!

“ఈ భూప్రపంచం లో చాలా మంది ఇప్పటికి ఉన్న విధానాలతోనే జీవించేస్తుంటారు. కొద్దిమంది పిచ్చోళ్ళు మాత్రం ఈ ప్రపంచాన్నే మర్చేయాలని చూస్తుంటారు.ఐతే గత కాలపు అభివ్రుద్ది అంతా వారి వల్లనే సాద్యపడింది” ఒక ఆంగ్ల సూక్తి.

ప్రపంచాన్ని మార్చటమే పనిగాపెట్టుకున్న పిచ్చోళ్ళ కధే, ఈ ” మంచి మిత్రుల కథ”.

దాదాపు దశాబ్ద కాలం క్రితం వెదుకులాడే పని(Search Engine) మొదలు పెట్టారు. సెర్గీ(Sergey Brin), లారి(Larry Page) అనే వారు ఇద్దరు మిత్రులు. వీరు కలసింది స్టాంఫర్డ్ విశ్వవిద్యాలయం(Stanford University) లో. ఇద్దరూ బాల్య మిత్రులేమీ కాదు. అలాగని అన్ని అభిప్రాయాలు కలసినవారు కూడా కాదు. కాని, వారిద్దరిలో కూడా ఎదుటివారిలొ తమకి నచ్చే గుణాలు కొన్ని ఉన్నాయి. దాంతో బాటు “ప్రపంచాన్ని మార్చిపడేసే” పని వారిని ఒక్కటిగా చేసింది. ఫలితంగా గూగులు (Google) అనే సంస్థ ఆవిర్భవించింది.

గూగులు అంటే చాల పెద్ద (ఒకటి ప్రక్కన ఒంద సున్నాలు పెడితే వచ్చే) సంఖ్య. నిజానికి గూగోల్ (Googol) అనాలి. కాని ఆ పేరు అప్పటికే నెట్ (Internet, ఇకపై, నెట్ లేక అంతర్జాలం అందాం) లో స్థిరపడిపొవటం వలన ఇపుడు మనం చూస్తున్న గూగులు(Google) గానే నిలిచింది. విశ్వవిద్యాలయంలో ఉన్నపుడే వారికి శోధించే (Search Engine)ఆలోచన వచ్చింది. దాన్ని కార్యరూపం లో పెట్టడానికై చదువును ( Phd ) మధ్యలో వదిలేసారు.కార్య శూరత్వం తప్పా, పెట్టుబడి కూడా లేనివారు . ఐనా, ఉన్న సొమ్ముతో సంస్థ మొదలుపెట్టేసారు. అనుకున్న దాని కొసం ముందుకు దూకారు. మొదట్లో పెట్టుబడి దారులెవరూ (V.Cs) ముందుకు రాలేదు. తెలిసినవారందరకూ వారి ప్రయత్నాన్ని(concept) అమ్మజూపారు. చాలామంది వీరి ప్రయత్నాన్ని శంకించారు.నచ్చిన ఇద్దరు వీసీలు మాత్రం కొద్దిపాటి పెట్టుబడి పెట్టారు. దాంతో కొంతకాలం నడిచింది. ఐతే, పెట్టుబడితో బాటుగా వారు పెట్టిన షరతులను కూడా అంగీకరించవలసి వచ్చింది. మూడో మనిషి ఎరిక్ ను (Eric Schimidt) సంస్థ ముఖ్యాధికారిగా ( C E O ) అంగీకరించవలసి వచ్చింది. రేయనకా పగలనకా పనిచేసారు. పనినే ఆటగా మలచుకున్నారు. మళ్ళీ పెట్టుబడి అవసరం పడింది. అప్పటికే శోధనా పరికరం( Search Engine Tool) వాడకం పెరిగింది. వాడుతున్న అందరికీ నచ్చింది. కాని పెట్టుబడి దారుల సందేహం ఒక్కటే. ” దీనిలో ఆదాయం ఎక్కడ ఉందనేది?” మిత్రులకైతే ఆ ఆలొచనే లేదు! కాని ఎరిక్ కు మాత్రం వ్యాపారం తెలుసు. ఆదాయం ఎలా రాబట్టాలో మిత్రులకు నచ్చ చెప్పగలిగాడు. దాని ప్రకారం, శోధనా యంత్రాన్ని యధా ప్రకారం అందరికీ అందుబాటులో వుంచారు. కాని, దానితో బాటుగా, వ్యాపార ప్రకటనలను జోడించారు. ఆదాయం రావటం ప్రారంభమైంది. అదే సమయంలో, అప్పటికే, అదే వ్యాపారం లోనున్న యాహూ(Yahoo), ఏ.ఓ.ల్ (A.O.L), అదగండి చెబుతా!( Ask Jeeves) లాంటి పెద్ద సంస్థలు వీరి సామర్ద్యాన్ని గుర్తించారు. ఆదాయం పెరగనారంభించింది. ఐనా, ప్రపంచాన్ని కదిలించే పనికి అది సరిపోలేదు. అ ఇష్టంగానే షేరు మార్కెట్టు లోనికి ముందస్తు పెట్టుబడికోసం ( I.P.O) ప్రవేశించారు. దానిని కూడా ప్రత్యేకంగా చేయాలనుకున్నారు. కొత్త విధానం ( Book building process) లో చాలా చిక్కులు ఎదుర్కున్నారు. ఇంతలో, వ్యాపార ప్రత్యర్దులు పెరిగిపోయారు.కోర్టు కేసులు పెరిగిపోయాయి.ఐనా, నిరాశ పడ లేదు. వెను దిరిగి చూడనూ లేదు. ఆగస్టు 2004 లో అనుకున్నది సాధించారు. 85 డాలర్లతో ప్రారంభమైన షేరు ధర 300 డాలర్లకు, ఒక సంవత్సరకాలం లొ, ఎగబాకింది. అప్పటికికాని ప్రపంచానికి తెలిసిరాలేదు, గూగులు శక్తి ఏమిటో! ముప్పై ఒకటవ ఏండ్ల వయసులో వందల కోట్ల అధిపతులు అయ్యారు.

మరి, శోధనాయంత్రం బలమేమిటి?
ప్రపంచంలోనున్న కంప్యూటర్లలోని వివరాలన్నిటిని (Data) క్రొడీకరించి, తమ సొంత కంప్యూటర్లలో నిక్షిప్తం చేసారు.శోధనాయంత్రం ద్వారా అడిగే ప్రశ్నలకు, సమాధానాలు వెదికే పద్ధతిని (Algorithm) రూపొందించారు. వచ్చిన ఫలితాలను క్రమ పద్దతిలో (Page Rank) అమరుస్తారు. ఈ క్రమం లో చాలా అంశాలను పరిగణలోనికి తీసుకొంటారు. అక్షరాల పద్దతి ( Text based ) లో పట్టికను, సమాధానాలుగా అందిస్తారు. ఆ విధంగా, రెప్పపాటు కాలం (less than one second)లో లక్షలాది పలితాలు అందించగలుగుతున్నారు.

లాభాలెలా వస్తాయి?
మీరు గమనించారో లేదో కాని, ఫలితాలతో బాటుగా మనకు కుడి వైపున వ్యాపార ప్రకటనలు వుంటాయి. అవి మనం అడిగిన ప్రశ్నల సమాధానాలకు దగ్గరైనవే (relavant) ఐ ఉంటాయి. ఎవరైనా ఆ ప్రకటన మీద నొక్కితే (Click చేస్తే) ఆ ప్రకటనదారుడు గూగులుకు కొంత మొత్తం చెల్లిస్తాడు. అలా ఆదాయం తనంతట తనే, ఏ విధమైన ప్రకటనల ఖర్చు లేకుండా, వచ్చేలా ఏర్పాటు చేయబడింది.

మరి అంతేనా! దాంతో వూరుకున్నారా?
వూరుకుంటారా! నిజానికి గూగులులో కొత్త ఆలోచెనలకు కొదవేమీ లేదు. ఏ విధమైన కొత్త ఆలోచననైనా మిత్రద్వయం ముందుంచ వచ్చు. వారికి నచ్చినట్లైతే, అనుమతి తో బాటుగా పెట్టుబడి కూడా లభిస్తుంది. పనిచేసే చిన్న సమూహన్ని(group) ఏర్పరుస్తారు. ఆ ఆలోచనపై ఆ సమూహం నిరంతరాయంగా శ్రమిస్తుంది. ఒకవేళ ఆ ఆలోచన నచ్చకపోయినా ఫర్వా లేదు. మీరనుకున్నదానిని సాధించ వచ్చు. దానికి వీలు కల్పించేది, 20 శాతం ఖాళీ పని విధానం. దీనిలో , వారానికి ఇరవై శాతం సమయాన్ని గూగులు వుద్యోగులు వారి సొంత ఆలోచనలను కార్యరూపంలోనికి తేవడానికి వుపయోగించుకొవచ్చు. ఆ విధంగా ఆవిర్భవించిందే గూగులు వార్తలు (Google News) అనే విభాగం. దీనిని భరత్ క్రిష్ణ అనే గూగులు వుద్యోగి కనుగొన్నారు.

ఇంకా ఏమున్నాయి?
చెప్పాలంటే చాలా వున్నాయి.
జి. మెయిలు(Gmail): ఏప్రీలు మొదటి రోజు 2004 న గూగులు జి. మెయిలు(Gmail)ను ప్రకటించింది. అప్పటికే హాట్ మెయిలు(Hot mail), యాహూ మెయిలు (Yahoo mail) లాంటి సంస్తలు ప్రముఖముగా ఉన్నాయి. ఐనా అందులోనికి అడుగు వేసారు. కాని, తమదైన పద్దతిలోనే, జి మెయిలును మిగతావాటి కన్నా భిన్నంగా వుంచాలనుకున్నారు. అప్పటి వరకూ ఎవరూ ఇవ్వలేనంత జాగా (space) ను జి మెయిలు వాడకందార్లు అందరికీ ఇవ్వాలనుకున్నారు. దానితో మొదలై, అందరినీ దాటుకుంటూ, ఎవరికీ అందనంత వేగంగా, ఇప్పటికీ ముందుకు సాగుతూనే వుంది.

గూగులు వార్తలు(Google News): అప్పటికి వున్న వార్తాపత్రికలు, వార్తలను అంతర్జాలం లో వుంచటం జరుగుతున్నది.ఐతే, ఎవరికైనా, భిన్న పత్రికల విభిన్న కధనాలు చదవాలనుకుంటే, అది కష్టసాద్యం. గూగులు వార్తలు అనే విభాగంతో ఇది సాద్యపదింది. సమాచారానికి సంభందించిన విశేషాల లంకెలు (Links) ఇందులో ఇవ్వబడతాయి. ఆ లంకెలను నొక్కటం ద్వార మనకు కావలసిన సమాచారాన్ని చిటుకులో పొంద వచ్చు.

గూగులు పుస్తకాలు (Google Books) : పుస్తకాలను నిక్షిప్తం చేసే ఆలోచన మొదటినుందీ వున్నదే ఐనా, ఈ అంశాన్ని గూగులు వాళ్ళు తరువాత వెలుగు లోనికి తెచారు. అంతకు పూర్వం, వేర్వేరు గ్రంధాలయల వాళ్ళు గంధాలను నిక్షిప్తం చేయటానికి వేరు వేరు పద్ధతులను అనుసరించే వారు. ఐతే గూగులు వాళ్ళు మాత్రం, ప్రకాశ హక్కులు లేని పుస్తకాలను అంతర్జాలంలో పూర్తిగా వుచితంగా చదువుకునేలాగున, ప్రకాశ హక్కులు (copy righted) గల పుస్తకాలను కొన్ని అంశాలను చదివి పుస్తకాన్ని కొనేలాగున( by providing links to book sellers) చేయటం ద్వార, చాల వరకు ఈ అంశం పై విజయం సాధించారు.
దీనితో బాటుగా, రీసెర్చ్ విద్యార్ధులకు ఉపయోగపడే పత్రికల ప్రతులను ( journal papers) ను అందించే గూగులు స్కాలరు( Google Scholar) అనే విధానాన్ని కూడా గూగులు అందిస్తూన్నది.

గూగులు సొంత సోది( Google Blogger): సొంత అభిప్రయాలను అందించే సోది చిట్టా ను గూగులు వాళ్ళు ఈ-బ్లాగరు పేరున అందిస్తున్నారు. దీన్నిప్రారంభించటం(Opening), ఉపయోగించటం(Data Entering) లాంటి వాటిని సులభతరం చేయటం ద్వారా అక్షరజ్ఞానమున్న ఎవరైనా దీన్ని నిర్వహించుకునే లాగున రూపొందించారు. దీని ప్రజాదరణ ఏమిటో మనకందరకూ తెలిసినదే!

గూగులు భూమి, దాని పటం (Google Earth and Maps): ఈ భూప్రపంచం పైనున్న ఏ ప్రాంతాన్నైనా గ్రద్ద కన్ను తో చూడగలిగే సాధనం గూగులు భూమి. దానితో బాటుగా భూమి చిత్ర పటాలను కలపటం ద్వారా ప్రపంచము లోనున్న ఏ ప్రాంతపు చిరునామా నైనా సులభముగా తెలుసుకొనే వీలు ఇప్పుడు కల్పించారు, గూగులు సోదరులు. పెద్ద ప్రభుత్వాలు చేయలేని పనిని చేసి చూపెట్టి, ఈ సదుపాయాన్ని గూగులు వారు ఉచితంగా అందిస్తున్నారు.

అలాగే, గూగులు సైటు (Google Site) ద్వార, సొంత వెబ్ సైటును రూపొందించుకునే విధానాన్ని, సెల్ ఫొను ద్వారా చిరునామాను, లేక, చిరునామా ద్వారా ఫొను సంఖ్యను తెలుసుకునే, గూగులు మొబైలు (Google Mobile) అనే విధానాన్ని, చిత్రపటాలను దాచుకునే గూగులు ఫొటొలను,ద్రుశ్య రూపకాలను (Google Photos and Videos ), లాంటివెన్నో ఈ సంస్థ రూపొందించింది. అన్నిటికంటే బాగా ఉపయోగపడే భాషాపరికరం (Google Translate ) ను రూపొందించి, ఏ భాష లోనున్న ప్రతినైనా కావలిసిన భాష లొ చదువుకునే వీలు కల్పించారు, మన మిత్రులు.
ఇంకేమీ లేవా?

లేకేం! గూగులులో మంట(fire) ఇంకా చల్లారలేదు. వివిధ అంశాలలో, కొత్త కొత్త ఆలోచనలతో వారు నేటికీ ముందుకు సాగుతూనే ఉన్నారు.ప్రస్తుతం డి. న్. ఏ. (D.N.A) క్రమాన్ని భద్రపరచే ప్రతులను రూపొందించే గూగులు జీనోం( Google Genome) అనే విషయం పై పని చేస్తున్నారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తెస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మైక్రొసాఫ్ట్, ఆపరేటింగ్ సిస్టం అనే ప్రధాన సాఫ్ట్వేరును అమ్ముకొని కంప్యూటర్లు వ్యాప్తి లోనికి రావటం వల్ల అమ్మకాలు పెరిగి లాభాలను గడిస్తే, గూగులు వారు, అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండేలా, తాము రూపొందించిన ప్రతి విధానాన్ని కొంతగా నైనా ఉచితంగా అందచేస్తూ ప్రసిద్ధి లోనికి వచ్చింది. ఇన్ని విభాగాలలో పనిచేస్తూ, వ్యాపార ప్రత్యర్ధులను ఎదుర్కుంటూ ముందుకు సాగుతున్న గూగులు అంచనాకు అందని ప్రబల శక్తి. మన కళ్ళెదుట జరిగిన విప్లవాత్మక మార్పు అంతర్జాలం (Internet) ఐతే, దాన్ని జనానికి చేరువలోనికి తెచ్చిన ఘనత మాత్రం ఈ ” మంచి మిత్రుల”దే!

మరమరాలు…


ప్రకటనలు

సన్యాసి పొడుపు కధ (The Monk and the Riddle)

ఆగస్ట్ 31, 2009

రచయిత: రాండి కొమిసార్

ప్రచురణ: హార్వర్డ్ బిజినెస్ ప్రెస్ స్కూలు

వెల: $22.50.

ఇది వ్యక్తిత్వవికాసానికి చెందిన పుస్తకం. ఐతే,ఇందులో రచయిత తన అనుభవాలను జోడించటం వలన ఇది, “ఔత్యాహిక పారిష్రామికవేత్త ఆత్మ కథ” గా అభివర్నించ వచ్చు. రచయిత మొత్తం పుస్తకాన్ని ఒక నవల లాగ నడిపారు.

కధా కాలం: 2000 దశకం.         స్థలం: సిలికాన్ వాలి, కాలిఫోర్నియ, USA

లెన్నీ (Lenny) అనే ఓ ఔత్సాహిక యువకుడు, వెబ్ సైటు (Web Site) ద్వారా శవ పేటికలను అమ్మాలను కుంటాడు. దాని ముందస్తు పెట్టుబడి కోసమై వెంచర్ కాపిటలిస్తులను ( Venture Capitalists, aka, VC, అంటే కంపనీ ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టి,భాగస్వామ్యం తీసుకొని, లాభదాయకము అనుకొన్నప్పుడు, భాగస్వామ్యన్ని అమ్ముకొని బయటపడే కంపనీలు, ఇకపై,వీసీ లని అందాము.) కలుస్తుంటాడు.  మొదట ఆ ప్రాజక్టు ( project) ఎవరికీ అంతగా రుచించదు. ఐనా, పట్టువదలని విక్రమార్కునిలా, వారు చెప్పిన మార్పులన్నీ చేస్తూ వారిని పదే పదే కలుస్తుంటాడు. అనుకొన్న ప్రాజక్టు ఛాలా మార్పులు చేసినా, అందులో, ఆత్మ లోపిస్తుంది. ఎందుకు ప్రాజక్టు చేస్తున్నాడో తెలియదు. ఇంతలో, తన అనుభవసారంతో, ప్రాజక్టు ఎలా వుండాలో రాండీకు స్పురిస్తుంది.

లెన్నీ మొదట తన స్నేహితురాలు, అలిసన్ (Allison) తొ కలిసి ఈ ప్రాజక్టు ను అనుకుంటాడు. తర్వాత్తర్వాత, ప్రాజక్టు ఎలా వుండాలో అనే వివరాల్లోకి వెళ్ళేటపుడు  భేదాభిప్రియాలు తలెత్తుతాయి. అదే సమయంలో ఆమెకు మంచి ఉద్యోగం రావటంతో ఏమి చేయాలనే సంధిగ్దంలొ పడుతుంది. లెన్నీ లాభార్జనే ప్రధానం అనే అభిప్రాయం తో వుంటాడు. రాండి సలహా తో వెబ్ సైటుని అందరికి ఉపయోగపడే సామాజిక కోణాన్నికలుపుకోవటంతో, ఆలిసన్ ఏకీభవిస్తుంది. అంతటి తో కథ ముగుస్తుంది.

రచయిత రాండి వ్యూహాత్మక ప్రధాన అధికారిగా (Virtual CEO), WebTV, Tivo, కంపనీలకు, ప్రధాన అధికారిగా (CEO)Crystal Dynamics ప్రధాన ద్రవ్య అధికారిగా (CFO) Go Corporation కు పనిచేసారు.ఆ క్రమంలో, తన అనుభవాలను జోడిస్తూ పాఠకులను ముందుకు నడిపిస్తూ సంభందిత విజ్ఞానాన్ని అందిస్తారు. అదే క్రమంలో శిలికాన్ వాలి కంపనీల ఆరంభించే పద్ధతులను , నడిపే విధానాలను తెలియపరుస్తారు. మొత్తం మీద నవల లా పట్టు సడలకుండ మనచేత చదివిస్తుందీ పుస్తకం.

ముఖ్యాన్శాలుగా

1. కంపనీ ప్రెసెంటేషనులు (The Pitch)

2. ఆటలో.. (Rules of Game)

3. వాయిదా జీవితము (Differed Life Plan)

4. డబ్బాశ కూడదా! (Romance, not the Finance)

5. గొప్ప ఆలోచన(Big Idea)

6. కంపనీ పునాదులు(Bottom line)

7. జూదం (The Gamble)

8. నాయకత్వం (The Leadership)

9. జీవితాశయం (Whole Life Plan)             కనిపిస్తాయి.

వివిధ అద్యాయాలతో అనేక అనుభవాలు జొడించబడ్డాయి. ముఖ్యం గా కొన్ని అంశాలు తెలుసు కోవలసినవి ఉన్నాయి.

గొప్ప గొప్ప ఆలోచనలు (Big Ideas):సిలికాన్ వాలీ లో చాలా మంది పెద్ద ఆలోచనలతో కంపనీ లను (start ups) ప్రారంభిస్తారు. ఇవి, కంపనీ పై నడిపే వారికున్న అవ్యాజమైన అనురాగంతో, వాటిని, ముందుకు నడిపిస్తూంటాయి. ఐతే ఆలోచన నుండి ఆచరణ లోనికి వచ్చేసరికి, నిలబడని కంపనీలు ఎక్కువే! చాలమంది సలహాలను తీసుకోరనేది, రచయిత అభిప్రాయం గా ఉన్నది. They are completely deaf and completely blind!

ద్రవ్యంతో మోహం (Romance, not the Finance): లాభాలతో కంపనీ నడపాలను కొనేవారికి, మొదట, తాను చేస్తున్న పని పై వ్యామోహం ( ప్రేమ) కలగాలి. అప్పుడే, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయనేది, రచయిత అభిప్రాయం. ఉదా: పెంపుడుజంతువులతో వ్యాపారం చేసే వ్యాపారులకు జంతువులపై అవగాహన, అంతకంతే ఎక్కువగా జంతువులపై ప్రేమ వుంటేనే వారు ఆ వ్యాపారం లో రాణించటానికి అవకాశాలెక్కువ.

వాయిదా జీవితం (Differed Life Plan): మనమతా జీవితం లో ఏదో చేయాలనుకొని, మరేదో చేస్తూ బ్రతికేస్తూ ఉంటాం. రచయిత దీన్నే రెండు భాగాలుగా విడగొట్టాడు. 1. ముందుగా చేయాల్సినవి. 2. తర్వాత చేయాలనుకొనేవి.   సాదారణంగా మనం ఏదో వుద్యోగం లేక వ్యాపారం చేస్తూ బ్రతుకు సాగిస్తూ వుంటాం. ఇందులో మనకు లభించే ఆనందం అంటూ ఏమీ వుండదు. కేవలం సంపాదన ప్రధానంగా జీవితం సాగుతుంది. ఐతే, మనకు ఆనందం కలిగించే వ్యాపకం ఏమిటో తెలుస్తూనే వుంటుంది. దాన్ని మాత్రం వాయిదా వేస్తూ, మరెప్పుడో చేయాలనుకుంటుంటాం.

గమ్యం ( The Whole Life Plan ): ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఒక్కోసారి మనం అనుకున్న ఫలితాలను సాధించలేక పోవచ్చు. దాన్ని ఓటమి అనుకో కూడదు. మన ప్రయాణ క్రమంలో నేర్చుకొనే పాఠాలు చాలానే వుంటాయి. when all is said and done, journey is reward!

ర,క్తి అనురక్తి (Drive and Passion): ఔత్సాహికులకు వీటి విలువ ఏమిటొ తెలిసినా, తేడా మాత్రం స్పస్టంగా తెలియదు. ఉడా: మీరు ఒక రైలు భోగిలో ఉన్నారనుకుందాం. మీ పెట్టికి వెనక ఇంజను వుండి ముందుకు తోస్తుంటే అది Drive. అలాకాక, ఇంజిను ముందుండి మీ పెట్టిని లాగుతుంటే అది passion. అర్థం కాలేదా! ఐతే, రచయిత మాటల్లోనె చదవండి! Drive ను శక్తి అనే ఇంధనం నడిపిస్తూ ఉంటుంది. ఆనురక్తి (Passion) ఉంటే, మీరంతట మీరే పనిని కౌగలించుకొంటారు.

చివరి మాట: Monk, who sold his Ferrari పుస్తకాన్ని చదువుతుండగా, ఈ పుస్తకం లభించింది. చిన్నది గా ( 181 పేజీలు) వుండటం వల్ల, బాగా చదివించే గుణం వల్లా ఈ పుస్తకాన్ని ముందుగా పరిచయం చేస్తున్నాను. ఇందులో కొన్ని పదాలకు సరి ఐన తర్జుమా కుదిరి ఉండకపోవచ్చు. కుదరని చోట, స్వేచ్చానువాదం చేయవలసి వచ్చింది, భావం మాత్రం అందించానని తలుస్తాను. అందరికీ ఈ పుస్తకం అందు బాటులో వుండకపోవచ్చు. వీలైతే, చదవండి.

మరమరాలు…


అప్పని వరప్రసాదమీ అన్నమయ్య

మే 7, 2009

dsc004772శ్రీ  తాళ్ళపాక అన్నమాచార్యుల జీవితచరిత్రం

రచయిత: తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు.
(చిన్నన్న)
ప్రతులకు: తిరుమల తిరుపతి దేవస్థానం
వెల: “వెల సులభం ఫలమధికం”

సుమారు 600 ఏండ్ల క్రితం ఈ భూమ్మీదకు దిగిన హరినందకాంశజుడు, శ్రీ  తాళ్ళపాక అన్నమయ్య. వేలకువేల సంకీర్తనలతో, తెలుగు భాషను పునీతంచేసిన వాడు, అన్నమయ్య. ఇంచుమించుగా, 550 ఏండ్ల క్రితం రాసినా, ఈ రోజుకు కూడ జనాల నోళ్ళలో నానుతున్న, ఈ పాటలు,   తెలుగు పలుకుబడులతో, పదాల కూర్పులతో,  మరెవ్వరికీ సాద్యం  కాని రీతిలో తెలుగు భాషలో  రచించబడిన సంకీర్తనలు.భక్తిని, రక్తిని, వేదాల్ని, వేదాంతాన్ని, సమాజరీతుల్ని, తన సంకీర్తనల ద్వారా అందరికీ చాటి చెప్పిన అన్నమయ్య గాధ, జీవిత చరిత్రగా మారి మన ముందుకొచ్చింది, సుమారు 60 ఏండ్ల క్రితమే.

అప్పటికింకా సంగీతం ఇంతగా అభివ్రుద్ది చెందలేదు.( ఆయన సంకీర్తనలకు రాగ నిర్దేశం జరిగినా, కొన్నింటికి తాళ నిర్దేశం జరుగలేదు. ) తెలుగు భాషలో అందునా జానపదాలతో పాటలు రాయటం ఊహకు కూడా అందని  ( సంస్క్రుతంలో రాసినవాడే కవి అని నమ్మిన ) కాలమది. అటువంటి కాలంలో, సంకీర్తనలకంటూ ఓ విధానం రూపొందించి ( సంకీర్తనా లక్షణమ్మనే గ్రంథం రచించినట్టు తెలుస్తూంది.), వాటిని జానపదుల పదాలతొ వ్యవహారభాషలో, శ్రీ వేంకటేశుని పరంగా ఆయన పాడిన పదాలు, నేటికీ నిత్యనూతనాలు, ఆ పాతమధురాలు, వన్నె తరగని తెలుగు దనపు గుభాళింపులు.
దాదాపు 150 సంవత్సరాల పాటు తెలుగు నేల పై విలసిల్లిన ఆ పదాలు ఆ తరువాత ఎందువల్లనో కనుమరుగై పోయాయి. “దాచుకో” అని అప్పనికి అప్పగించిన పదాలను,  ఆయన దాచేసుకున్నట్లున్నాడు,  మనకు అందుబాటులో లేకపోయాయి. 1816లో అచ్చువేయించిన  A. D. Campbell  రచించిన “Grammar of Telugu Language” పుస్తక పీఠికలో,  ” పవిత్రమైన తిరుపతి కొండ మీద, ఒక  వ్యాకరణ ప్రతి, మిగిలనవన్నీ, ఆ దైవాన్ని స్తుతిస్తూ రాసిన అసంఖ్యాక మైన కీర్తనలు” అని అన్నమయ్య కీర్తనల ప్రస్తావన జరిగినది. ఐతే ” the whole collection was found to contain nothing but voluminous hymns of the deity” అనేది, భాషాపరిమళం తెలియని దొర గారి అభిప్రాయమైనా, దాని ఆధారం గానే అన్నమయ్య క్రుతులు వెలుగు లోనికి వచ్చాయి.1922 లో, భాష్యకారుల సన్నిధానం వద్ద, ఇప్పుడు అన్నమయ్య అర అనబడుతున్న చోట, ఇరువైపులా,  అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలయ్య, అరను చూపిస్తూ, నిలుచున్న తీరును గమనించిన దేవాలయ అధికారులు, అరను తెరిపించి చూడగా, సంకీర్తనల రాగి రేకులు వెలుగు చూసాయి( హుండీ కెదురుగా నేటికీ ఈ అరను చూడవచ్చు. )

ఐతే అన్నమయ్య జీవితచరిత్ర కు సంబంధించిన ఆధారం చిన్నన్న రాసిన “అన్నమయ్య జీవితచరిత్రము” అనే ద్విపద కావ్యం. ఎవరెన్ని వూహించి రాసినా, ఆయన జీవితాన్ని ఎన్ని విధాలుగ అర్థం చేసుకోవాలన్నా, అది చిన్నన్న కావ్యం తోనే జరిగింది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచన గా ప్రచురితమైన ఈ “అన్నమయ్య జీవిత చరిత్రము” ద్విపద కావ్యమును పరిష్కరించి రాసి, ప్రచురించిన( తి. తి. దేవస్తానం చే) వచనం. దరిమిలా మరి రెండు పునః ముద్రణలు పొందిన ” జీవిత చరిత్ర” ఇప్పటి వరకూ దొరకిన ఆధారాల మాలిక. వివిధ ఘట్టాలుగాచిన్నన్న రాసిన ద్విపదలో
* అన్నమాచార్య వన్శ్యులు, తాతలు, తండ్రి నారాయణ సూరి
* అన్నమయ్య జననం, బాల్యం , విధ్యలు
* తిరుమల ప్రయాణం
* దేవి ప్రత్యక్షము, శతకం చెప్పుట
* కొండ పై దివ్యస్థలముల దర్శనం
* స్వామి దర్శనం, శతకం చెప్పుట
* అర్చకులు అన్నమయ్య మహిమ గుర్తించుట
* అన్నమయ్యకు పంచసంస్కారములు (వైష్ణవ ఆచారము)
* అన్నమయ్య పెండ్లి
* సాళువ నర్సింగరాయని దర్శనం, సంకెల బెట్టుట, పిదప పశ్చాత్తాపం
* అన్నమయ్య మహిమలు
* పురందరదాసుని తో చెలిమి
* అన్నమయ్య ఇతర రచనలు
* వారి సంతతి గురించి వర్ణన ఉంది.
ఐతే అన్నమయ్య పంచసంస్కారములుకూ  అన్నమయ్య పెండ్లికీ మధ్య కొంత కాలానికి సంబంధించిన వివరాలు గ్రంథ పాతము వలన లభ్యం కావటం లేదు.

ఈయన సంకీర్తనల విధానాన్ని ఒక్కసారి పరికిస్తే మొదట పల్లవి, ఆ తరువాత చరణాలతొ( సాధారణంగా 2 లేక 3 ) వుంటాయి. కొన్నిటిలో అనుపల్లవి కూడా  వుండటం కద్దు. పల్లవి చరణాల సారాంశంగా ఉండి, చరణాలకు దిక్చూచిగా ఉంటుంది. చరణాలు పల్లవిని విశధీకరిస్తూ సాగుతాయి. కొన్ని గీతాలలో ప్రతీ పాదం ఈ పనిని నెరవేర్చటం జరుగుతుంది. మచ్చుకు ” కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” సంకీర్తనాన్ని తీసుకుందాము.
పల్లవిలో వెంకటేశ్వరుడు కొండలంత వరాలను గుప్పించేవాడని చెప్పి, మొదటి చరణంలో, కురువరత్తినంబికు ఇచ్చిన వరాలని, తొండమాన్ చక్రవర్తికి తోడ్పడిన విధానాన్ని వివరిస్తే, రెండవ పాదం లో, అనంతాళువారికి చేసిన సేవల్నీ గురించి, తిరుమలనంబి తొ ముచ్చట్ల గురించి చెబుతాడు. చివర పాదంలో తిరుక్కచ్చినంబిని కరుణించిన విధానాన్ని చెప్పి, “ఎంచ నెక్కుడైన వేంకటేశుడు మనలకు” అంటూ వేంకటేశ్వర ముద్రతో ముగిస్తాడు.

మొత్తం సంకీర్తనలు ” పరమ తంత్రములు ముప్పది రెండువేలు” గా చిన్నన్న తెలిపాడు. అలాగే, ” పాడేము మేము పరమాత్మ నిన్నును, వేడుక ముప్పదిరెండు వేలల రాగాలను” అని అన్నమ్మయ్య సూచించాడు. ఐతే ఇప్పటి వరకూ దొరికినవి, ఇంచుమించుగా, పదహారు వేల కీర్తనలు. ఇవి, రాగి రేకులు గా, వ్రాతప్రతులు గా, వేర్వేరు ప్రాంతాల నుండి సంగ్రహించినవి. అన్నమ్మయ్య జీవితకాలంలో దర్శించిన ప్రదేశాలలో మరి కొన్ని దాగి వుండ వచ్చు. అలాగే రాగి లోహం కోసం కొందరు రేకులను కరిగించివేసారనే అపప్రధ కూడా మనం వింటున్నాం. దొరకిన వాటిల్లో, 3 నుండి 4 వేల సంకీర్తనలను రాళ్ళపల్లి అనంత క్రిష్ణ శర్మ, నేదునూరి క్రిష్ణ మూర్తి మొదలుకొని, ఈనాటి తరంవారైన శొభారాజు, గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాదు వరకూ స్వరకల్పన చేసారు. వీరె కాక  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ,రజనీకాంత రావు, మల్లిక్ వంటి వారు కూడా విశేష క్రుషి సలిపి కొన్ని గీతాలకు మంచి మంచి బాణీలను అందించారు. అలాగే వర్థమాన సంగీత కళాకారులు కూడా తమ వంతు క్రుషి చేస్తున్నారు. ఐతే, అన్నమాచార్యుని సంకీర్తనలలో, ఒకే సంకీర్తన  మనం వివిధ బాణీలలో వినటం జరుగుతుంది. కారణం,ఇప్పుడు వింటున్న బాణీలేవీ ఆయన స్వయంగా కూర్పు చేసినవి కావు. సంకీర్తనలు శిష్య పరంపరగా మనకు అందలేదు. అందువల్ల చాలవరకు బాణీలను ఇప్పటి తరం గాయకులు, అన్నమయ్య సూచించిన రాగాల ఆధారంగా,  స్వర రచన చేసారు. కొన్నింటినైతే, ఆయన సూచించిన రాగాలలో కాక వేరే రాగాలలో,  స్వర రచన చేసారు. ఐతే మిగిలిన 12 వేల సంకీర్తనల మాటేమిటి? క్రితం ఏడాది, 600వ జయంతి సందర్బంగా, త్వరలోనె మిగిలిన సంకీర్తనలను స్వరబద్దం చేస్తామని ప్రకటించారు. పూర్తి ఐనట్టు లేదు. ఒక వేళ అన్నింటి స్వరరచన పూర్తి ఐనా, వాటిని సామాన్య ప్రజానీకానికి తీసుకుని వెళ్ళటం ముఖ్యం. ( అన్నమయ్య ప్రాజక్టు ద్వార స్వరపరచిన కీర్తనలు  C. D, cassette  రూపంలో తి. తి. దేవస్థానం వారు తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఈ సారి తిరుమల దర్శించినప్పుదు వాటిని కొని, విని ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!)

అన్నమాచార్యులు, సంకీర్తనలనే కాక, ఇతర రచనలు ,
” ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున
నవముగా రామాయణము, దివ్య భాష
నా వేంకటాద్రి మహాత్యమంతయును
గావించి, రుచుల శ్రుంగార మంజరియు
శతకముల్ పది రెండు సకల భాషలను
ప్రతిలేని నానా ప్రభంధముల్ చేసి” నట్లు గా చిన్నన్న చెప్పాడు.
ఇందులో కొన్ని తెలుగులోను, సంస్క్రుతములోను, ఇతరభాష లలోను చేసినట్టు తెలుస్తూంది. పైన చెప్పిన రచనలలో చాలా వరకూ ఇప్పుడు లభ్యం కావటం లేదు.

ద్రవిడ భాషలయిన తెలుగు, కన్నడ భాషలలో లభించిన ఆధారాలనుబట్టి చూస్తే,  అన్నమయ్య సంకీర్తనలే ప్రాచీనమైనవి. కర్ణాటక సంగీతానికి ఆద్యునిగా పరిగణించబడుతున్న, పురంధరదాసు, అన్నమయ్య తరువాతి తరం వాడేనని చెప్పవచ్చు. క్షేత్రయ్య, రామదాసు, సంగీతత్రయం( త్యాగయ్య, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి) మున్నగువారంతా , ఈయన తరువాత తరముల వారే! అందుకే ఈయన ” పద కవితా పితామహు”ని గా ప్రసిద్ధి కెక్కాడు.

కవితా రీతులకు వస్తే, చిన్నన్న చెప్పినట్లు
” యోగ మార్గంబున నొక కొన్ని బుధులు
రాగిల్ల శ్రుంగార రస రీతి గొన్ని
వైరాగ్య రచనతో వాసింప గొన్ని
సారస నేత్రుపై సంకీర్తనలు ” అన్ని రీతులలొ ఈయన సంకీర్తనలు సాగాయి.
“ఏల నీ దయ రాదూ”  ( త్యాగయ్య ) లాంటి భావనలు మచ్చు కైనా కానరావు. ఆంతటా, హరి సంకీర్తనమే! శ్రుంగారం కానీయండి, వైరాగ్యం కానీయండి, హరి సంకీర్తనమే పరమావధిగా సాగిన సంకీర్తనలలో అక్కడక్కడా, అప్పటి సమాజాన్ని, దాని పొకడలనూ పట్టిచ్చాడు.

“చాటెదనిదియే సత్యం సుండో
చేటు లేదీతని సేవించినను” అని శ్రీ హరి విశేషాలను ఎలుగెత్తి చాటాడు.
“రహస్యమిదివో రహి శ్రీ వెంకట
మహీధరమున మనకై నిలిచె” అని రహస్యాలను విప్పి చెప్పాడు.
“రూకలై, మాడలై, రువ్వలై తిరిగీనీ
దాకొని వున్నచోట దా నుండ దిదివో” అంటూ లక్ష్మీ విలాసాన్ని తెలిపాడు.
” నాటికి నాడే నా చదువు
మాటలాడుచును మరచేటి చదు”వంటూ వంట బట్టని నేటి విద్యలను హేళన చేసాడు.
కాపీరాయుళ్ళను ఈసడిస్తూ,
“వెర్రులాల మీకు వేడుక గలిగితేను

అఱ్రువంచి తడుకల్లంగ రాదా” అన్నాడు.

“పుట్టు భోగులము మేము భువి హరిదాసులము
నట్ట నడిమి దొరలు నాకియ్యవలెనా” అంటూ రాజాశ్రయాల్ని ఈసడించాడు.
“వెఱతు వెఱతు నిండు వేడుక పడనిట్టి
కుఱుచ బుద్ధుల నిట్టు గూడుదునయ్య” అంటూ విలువలు పాటించని దొరలను తెగనాడాడు.
” మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొక్కటే
చండాలుడుండేటి సరి భూమి యొకటే” ననే సామ్యవాదాన్ని ఆనాడే చాటాడు.
” పుట్టుట నిజము, పోవుట నిజము
నట్టనడిమి పని నాటకమ”ని వేదాంతాన్ని
“పరగిన సత్య సంపన్నుడైన వాడే
పరనింద సేయ తత్పరు కాని వాడు
అరుదైన భూతదయా నిధి యగు వాడె
పరులు తానే యని భావించు వాడే” మనిషని స్పష్టీకరించాడు.
“తనలోని జ్ఞానమును తప్పకుండా తలపోసి
పని తోడ నందు వల్ల భక్తి నిలిపి” అంటూ మన జీవితలెనెట్లా మలచుకోవాలొ “మూడే మాటలంటూ” వేదాంత రహస్యం గా వెల్లడించాడు.
” చీ, చీ, నరులదేటి జీవనం
కాచుక శ్రీ హరి నీవే కరుణింతు గాక” యని మానవుల జీవిత విధానాలను తూర్పూరబట్టాడు.
“కడు నజ్ఞానపు కరవు కాలమిదే
వెడల దొబ్బి మావెరవు దీర్చవే” ఆనాటి కరువు కాలాన్ని మన ముందుంచాడు.
ఇక, అన్నమయ్య పదాల తీరు తెన్నులకొస్తే
” వెనెలపై తేట  తిన్నని చెఱకు
పానకముల నేరుపరచిన మేలు
చక్కర లో తీపు  చల్ల తెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నముల
కలయమ్రుతంబు మీగడ మీది చవులు” అని చిన్నన్న అనటంలో అతిశయోక్తి లేనే లేదు.

జాజర పాటలు,  చందమామ పాటలు, లాలి పాటలు, జోల పాటలు, తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, దంపుడు పాటలు, పెండ్లి పాటలు, హారతి పాటలు, తందనాన పాటలు, మొదలైనవి జనబాహుళ్యనికి దగ్గరైన పదాలతో, వారి పాటలు గానే రాసి, వారి శ్రమ  లో సంతోషములో
శ్రీ వారిని కొలిచేటట్లు చేసి, ఆయనతో వారు మమేక మయ్యేటట్లు చేయగలిగిన హరి భక్తుడాయన.
” అరె చూడరె మోహన రూప”మంటూ శ్రీ హరిని
“నిందరికి అభయ్యమ్మిచ్చు ” అభయ హస్తాన్ని
“బ్రహ్మ కడిగిన” శ్రీ హరి పాదాన్ని
“చక్రమా” అంటూ ఆయుధాన్ని
“ఆదివో” అంటూ శ్రీ హరి నివాసాన్ని
“దేవునికి దేవికిని తెప్పల” కోనేటినీ
“తిరువీధుల మెరసీ” అంటూ బ్రహ్మోత్సవాల నీ
” పలుకు తేనెల తల్లి” యని అలమేలు మంగ నూ
“కొలువై వున్నాడు వీడే” యని గోవింద రాజుల్నీ
” రంగ రంగ” యని శ్రీ రంగ నాధుణ్నీ
“రాముడు రాఘవుడు” అని రవి కుల తిలకుడినీ
“ముద్దు గారే” యశొదా తనయుణ్ని,
“పెరిగినాడు చూడరో’ యని హనుమంతుడిని
“నమో నమో” యని నారసిమ్హుడినీ, ఇలా పలు కీర్తనలతో తానెరిగిన ప్రదేశాలలొని పలు దేవతలను  ప్రస్తుతించాడు.
అలాగే ఒకే విషయంపై పెక్కు గీతాలున్నాయి. ప్రతి దినమొక సంకీర్తన లక్ష్యం గా చేసికొన్న అన్నమయ్య కు తమిళ హరి భక్తులు ఆళ్వారులే స్పూర్తి. ఐతే, అక్కడక్కడా పునరుక్తి భావాలను మనం పసిగట్టవచ్చు.  రాశి ని పరిగణలోనికి తీసుకున్నా, వాటి పదాల కూర్పును తీసుకున్నా, ఏ సంకీర్తన కది విశిష్తమైనదే!

తెలుగు సంస్క్రుత భాషలలో అసమాన ప్రతిభ కలిగి ఉన్నా, ఎక్కువగా అచ్చ తెలుగు భాషలో సంకీర్తనలను రాయటం, ఈ భాషాపరులు చేసుకొన్న పుణ్యమనే చెప్పాలి.
“ఎట్టైనా జేసుకో, ఇక నీ చిత్తము నన్ను
పట్టిచ్చె మా గురుడు నీ పాదాలు విడువ” నన్న భక్తి పరుడు అన్నమయ్య.
ఉప సమ్హారం:
చిన్నన్న ద్విపద ఆధారంగా, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించి రాసిన “అన్నమయ్య జీవిత చరిత్రము” మూడవముద్రణ ఈ రచన కాధారము. వారున్నూ, వారి శిష్యులు
అర్చకం శ్రీనివాసులు చేసిన క్రుషి మరువరానిది. ఈ రంగం లో  ఉద్ధండుల చే చాల  రచనలు చేయబడ్డాయి. వాటిలో చాల వరకు, తి. తి. దే. ప్రచురణల గా మనకు దొరుకుతాయి. ఆసక్తి ఉంటే మరిన్ని విషయాలు తెలుస్తాయి.
అన్నమయ్య 601 వ జయంతి సందర్బంగా ఈ రచన వెలువరించాను. మీలొ చాలా మందికీ విషయాలు తెలిసే ఉండవచ్చు. నాకు తెలిసిన కొన్ని విశేషాలతో ఈ రచన చేసాను.
అన్నీ ఒకే వ్యాసం లో రాయటం దాదాపు అసాధ్యం. మీలో ఎవరైనా మరిన్ని విశేషాలు తెలిపితే నాకూ సంతోషమే!
ఉంటాను.
…మరమరాలు

నా జీవిత యాత్ర ( టంగుటూరి ప్రకాశం పంతులు: పుస్తక పరిచయం )

ఏప్రిల్ 27, 2009

నా జీవిత యాత్ర ( టంగుటూరి ప్రకాశం పంతులు: పుస్తక పరిచయం )

dsc004746

ప్రచురణ: తెలుగు సమితి

వెల: రు:200/-

పేజీలు: సుమారు 700

ప్రతులు అన్ని విశాలాంధ్ర పుస్తక విక్రయ కేంద్రాలు

ప్రకాశం పంతులు గారి పేరు తెలుగు వారందరికి చిరపరిచితమైనా, ఓ రాష్త్ర ముఖ్యమంత్రి గానొ, లేక ఓ జిల్లాకు తన పేరును స్థిరపరుచుకున్న నాయకునిగానో ( తన పేరును ఆయన పెట్టుకో లేదు), కాకపోతే ఓ బారేజి కి ఉన్న పేరు గానో మాత్రమే ఆయన మనకు తెలుసు. అంతేనా! ఆ మహానుభావునిగురించి మనకు తెలియాల్సింది?

ఒక జాతికి రూపం స్వరూపం సముపార్జించిపెట్టిన ఆ మహనుభావుని గురించి మరింతగా తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!

రాసింది రాజకీయ నాయకులైనా, ఆనాటి ఘటనలు తెలుసుకోవాలనే ధ్యాసతో మొదలెడితే, పూర్తి అయేవరకు, ఈ పుస్తకం, మనచేత చదివిస్తుంది.

దేనికి వెరవని తనం, అనుకున్నది సాధించటానికి తనదైన శైలిని విడనాడకపోవటం, తన కున్నదంతా ప్రజల అభిమానధనం అని నమ్మిన ప్రకాశం పంతులు గారు నిజంగా మన తరానికి మార్గదర్శి. చివరకు ఏమీ మిగిల్చుకోకపోఇనా, రాష్త్ర ప్రజల అభిమానం మాత్రం పుష్కలంగా మిగిల్చుకున్న ఆ అభిమానం కూడా కాలక్రమేనా కరిగి ఆవిరైపోతుంటే, మళ్ళీ ఆయన త్యాగాలు, ఆయన పని విధానం,ఆయన తెంపరి తనం, ఆయన తెగువ తెలియాలంటే, భాషాభిమానులంతా చదవాల్సింది ” నా జీవిత యాత్ర “.

మొత్తం నాలుగు సంపుటాలుగా వెలువడిన ఈ పుస్తకాన్ని ఒకే పుస్తకంగా తెలుగు సమితి వారు విడుదల చేసారు.

మొదటి సంపుటం:

*బాల్యం, యుక్త వయస్సు లో వేషాలు ( నాటకాలు )

*రాజమండ్రి లో మునిసిపల్ రాజకీయాలు

*ఇంగ్లండు లో బారిస్టరు చదువు

*చెన్నపట్నంలో ప్రాక్టీసు

*రాజకీయం లో తొలి రోజులు

* ” స్వరాజ్య ” పత్రిక స్థాపన వరకు వివరిస్తుంది.

రెండవ సంపుటం:

*కాంగ్రెస్సు (National) లో సభ్యత్వం

*జాతీయోద్యమంలో ఆయన పాత్ర

మూడవ సంపుటం:

*సైమన్ “తిరిగి ఫో”

*కాంగ్రెస్సుతో విభేదాలు

*దక్షిణాదిన ఉప్పు సత్యాగ్రం

* జైలు జీవితం *” స్వరాజ్య ” పత్రిక మూసివేత వరకు చెబుతుంది.

నాల్గవ (చివరి) సంపుటం:

*1937 శాసనసభ ఎన్నికలు

*సభావిశేషాలు, పాలనా విధానము

*వేలూరు జైలు జీవితం

*క్విట్ ఇండియా ( QUIT INDIA ) ఉద్యమం

*1946 రాజకీయాలు

*ప్రకాశం గారి మంత్రి వర్గం (ఉమ్మడి మద్రాసు రాష్త్రం లో)

*ఆంధ్ర రాష్త్రం, దాని నిర్మాణం

*ప్రకాశం బారేజి

*శ్రీ వేంకటేశ్వర విశ్వవిధ్యాలయం

*శాసనసభలో విశ్వాసరాహిత్యం

* నిర్యాణం తో ముగుస్తుంది.

మొదటి మూడు సంపుటాలను ప్రకాశం పంతులు గారె రాసారు. ( ఆత్మ కధ కదా!) ఐతే, నాల్గవ (చివరి) సంపుటం మాత్రం ఆయన అనుయాయులు శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు పూర్తి చేసారు. చివరలో ఒందవ జయంతి ఉత్సవాల గురించిన విశేషాలు, photo లను పొందు పర్చారు.

ఆసక్తి కలిగించే సంగతులు:

* బాల్యంలో వీధి యుద్ధాలు, నాటకాలు, ఇమ్మనేని హనుమంతరావుగారి సహాయం. ఒక ముఖ్యమంత్రి, చిన్నప్పుడు, వీధి గొడవల్లొ తలదూర్చడం, దెబ్బకు దెబ్బ వేయటం, (క్షమించాలి! ఇప్పటి నాయకుల పార్టీ టిక్కెట్ల కొట్లాటలతో పోల్చవద్దు.) అవన్నీ యవ్వనపుటావేశంతో చేసినవి తప్పా, ఒక ప్రణాళిక కాని, రాజకీయ ఉద్దేశాలు కాని లేనివని గమనించాలి!

* ఒంగోలు నుండి రాజమహేంద్రవరం (రాజమండ్రి) వరకు ప్రయాణానికి, అనువైన సమయం కుదిరిన తర్వాత, అంటే కాలవల్లో నీరు చేరిన తర్వాత, రెండు వారాల సమయం తీసుకోవటం.

* రాజమండ్రి మున్సిపల్ వ్యవహారాలలో నేటి తరం రాజకీయాలు ప్రతిభింబించడం.

* ఇతరుల ఆర్థిక సాయంతో ఇంగ్లండు చదువు, అక్కడ దొరలతో పరిచయాలు. ” ఎప్పటికైనా మన దేశం ఈ ఉన్నతి స్థితి కి వచ్చి ఈ జాతులతో తులతూగుతుందా?” అనే దేశ భక్తివెన్నంటి ఉండటం.

* మద్రాసులో ప్రాక్టీసు, వ్రుత్తిలో రాణింపునకుగల కారణాలు మనం పరిశీలించాలి! అన్నీ న్యాయబద్ధమైన కేసులే వాదించినట్టు లేదు.

* కాంగ్రెస్సు సభలలో ఆడంబరాలు (అప్పట్లోనే! అదీ గాంధీగారి న్యాయకత్వంలోనే!!), సభలలో తలలు బద్దలు కొట్టుకొవటాలు,( అదే కాంగ్రెస్సు సంస్క్రుతి దిన దిన ప్రవర్ధమానమై, నేటికి ఈ రూపం లొ చూస్తున్నాము!) ఇతే గాంధీగారు sacred cow కాదని, ఆయనతో విభేదించినవారూ, ఆయన ఇతరుల మాటలు నమ్మి దూరం చేసుకున్నవారు ఉన్నారనే సంగతులు మనకు తెలుస్తాయీ పుస్తకం చదివితే. ( అలా దూరం కాబడ్డవారిలో ప్రకాశం గారొకరు.)

* ప్రకాశం గారి బలమంతా ఆయన ప్రజలు న్నూ, ” స్వరాజ్య” పత్రిక న్నూ. ఆ పత్రికను గాంధీగారు మూసివేయమనటం, ఆయన దానిని తిరస్కరించడం, ఆర్థికంగా చితికిన తర్వాత మూసివేయబడటం, జీర్నించుకోలేని సత్యాలు.

* అలాగే, కాంగ్రెస్సు తో విభేదించి, ప్రజల తోడ్పాటుతో తానే ఓ పార్టీకి నాయకుడై తెలుగు నాట ప్రజలను నమ్ముకొన్న తీరు కూడా మనలను విస్మయ పరుస్తుంది. ( ” ప్రజా పార్టీ” అని ఓ పార్టి, జనతా పార్టీ రాక మునుపు వరకూ ఆంధ్ర ప్రదేశ్ (ముఖ్యంగా కోస్తా) లో ప్రతిపక్షం గా పోటీ చేస్తుండేది. అది ప్రకాశం గారు స్థాపించిన పార్టీయే అని ఈ మధ్యే తెలిసింది.)

* రాష్త్ర నాయకులతో సంబంధాలు, జాతీయ నాయకులకు వివిధ ఉద్యమాలలో తోడ్పాటు, ముఖ్యంగా నాగపూర్ సభలో “కావలిస్తే జనాల్ని ” సరఫరా చేస్తాననటం, ఆయన జాతీయ చరిత్రలో, ఆంధ్రుల చరిత్రతో బాటు, మమేకమైన తీరును విశధీకరిస్తుంది.

* సైమన్ కమీషన్ వ్యతిరేక ఉద్యమంలో ” థైర్యం ఉంటె కాల్చు! మేమంతా సిద్ధం గా ఉన్నాం!! ఆయన ఎవరో నీకు తెలియదల్లె ఉంది.” అన్నది తన పక్కన నిల్చున్న ముస్లిం యువకుడని రాయటంలో ఆయన నిజాయితీ ఏమిటొ మనకు అర్థం ఔతుంది. ( ఈ సంఘటన వల్లనే ఆయనకు ఆంధ్ర కేసరి అని పేరొచ్చిందని అంటారు.)

* “ఆకాంక్ష” పేరుతొ 3వ సంపుటం 17వ అధ్యాయంలో రాసిన చివరి మాట, ఈ పుస్తకానికి ఆయనే రాసుకున్న సమీక్ష అంటే సరిపోతుంది. ” ఆంధ్ర అంటే ప్రకాశం! ప్రకాశం అంటే ఆంధ్ర ” అనేది వారి నమ్మిక. జేబులో పైసా ( sorry, కాణీ) లేకుండ ఆంధ్రా పర్యటనలో, ఓ పెట్రొలు పంపులో ఆయన పెట్రొలు అడిగిన తీరు, పైన చెప్పిన భావాన్ని బలపరుస్తుందను కుంటా! ( ఈ సంఘటన ఆంధ్ర కేసరి సినీమా లోనిది.)

* చివరగా, ఆంధ్ర రాష్త్ర ఏర్పాటు! బళ్ళారినీ, మద్రాసునీ వదులుకోవటం గురించి. ఆ రొజుల్లో రాష్త్ర ఏర్పాటును త్వరితం చేయటానికై, వాటిని వదలుకొని వుండవచ్చు! (తన తొలినాటి ప్రసంగంలో క్రీ|| శే|| ఎన్. టి. రామారావు గారు ఈ ఆంశాన్ని లేవనెత్తినట్టు గుర్తు.) ఏది ఏమైనా, రాష్త్రం ఏర్పడింది. జనం శాయశక్తులా పాటుపదటం వల్లా, విధ్యాలయాలు ఏర్పడటం వల్లా, సమ్రుద్ధిగా వనరులు వుండటం వల్లా మన అభివ్రుద్ధి సాధ్య పడింది. ఇంకా ఉమ్మడి రాష్త్రంలో ఉండుంటే ఎట్లా వుండేవారమో కదా!

ఐతే K C R గారికి ఇక్కడో point దొరుకుతుంది. విభజన కావాలంటే కొంత వదులుకోక తప్పదేమో!

” చివరికి 1952 సొషలిస్ట్, కమ్మునిస్ట్ పార్టీలలోని ఆంధ్ర సభ్యులు చెన్నపట్టణం మీద ఆశలు వదులుకోవటం వల్ల, ఆంధ్ర రాష్త్ర కాంగ్రెస్సు వారు చెన్నపట్టణం తమిళ రాష్త్రం లో కలిపివేయాలన్న నివేదిక పై సంతకం చేయటం వల్ల, ప్రకాశం గారూ, ఆయన ఆనుయాయులూ చెన్నపట్టణం లేని ఆంధ్ర రాష్త్రం ఏర్పడటానికి అంగీకరించ వలసి వచ్చింది.” ఇది తెన్నేటి మాటల్లొ ఆంధ్ర రాష్త్ర విభజన గురించి.

అలాగే, 1952 ఎన్నికలలో కాంగ్రెస్సుకు వ్యతిరేకంగా స్థాపించిన ” కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ” ద్వార 117 అభ్యర్దులను నిలిపితే, ” ఇందులో సర్కార్ జిల్లాల నుండి అనేకులు గెలిచారు. ప్రకాశం గారు చేసిన ప్రచారం వల్ల లాభం పొంది, పార్టీ గెలవని చోట్ల కమ్మునిస్టులు కాని స్వతంత్ర అభ్యర్దులు కాని, గెలిచారు. కాంగ్రెస్సు పేరున గెలిచినవారు ఏ మాత్రమైనా ఒక్క రాయలసీమ లోనే గెలిచారు.” ఇదీ ఆంధ్ర ప్రజలపై ప్రకాశం గారి పట్టు.

ఛివరగా నా మాట: ప్రకాశం పంతులు గారి గురించిన మరిన్ని వివరాలు చాల మంది పెద్దలకు (ఈ పుస్తకం లో రాయబడనివి) తెలిస్తే, ఆ వివరాలు తెలిపితే చాలా చాలా సంతోషిస్తా!

…మరమరాలు

Hello world!

మార్చి 22, 2009

తెలుగు లొ పుస్తకాల సమేక్షలు, అవీ ఈవీ రాయాలనుకుంటున్నా.

నేను, నా భావాలు, నా వ్రుత్తి ప్రవ్రుత్తి ఇందులొ ప్రచురిందామని నేను ఈ blog ను తెరిచాను.

వేచిచూడండి!

మిగతా వివరాల కోసం.

మరమరాలు